- – 300 కిలోల బంగారాన్ని విరాళంగా ఇచ్చిన థాయ్‌లాండ్ బౌద్దులు
- – బంగారానికి కాపలాగా ఉన్న 24 మంది థాయ్ గార్డులు
- – పూత పనుల కోసం థాయ్‌లాండ్ నుంచి 12 మంది నిపుణులు
బౌద్ధుల ఆధ్యాత్మిక ధామం ప్రఖ్యాత మహాబోధి ఆలయం రూపురేఖలు మారిపోతున్నాయి. ఈ గుడి అతి త్వరలోనే స్వర్ణ కాంతులతో ధగధగలాడనుంది. ఇప్పటికే ఆలయంలో కెమికల్ ట్రీట్మెంట్ పూర్తి చేశారు. ఇక బంగారు పూత వేయడమే తరువాయి. ఒకటి రెండు కాదు.. ఏకంగా 3 వందల కిలోల బంగారం.. థాయ్‌లాండ్ నుంచి బోధి టెంపుల్‌కి చేరుకుంది.
బీహార్‌లోని బౌద్దపుణ్యక్షేత్రం మహాబోధి.. దశ తిరగనుంది. ఎంతో పురాతన చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని మరింత శోభితం చేసేందుకు బౌద్దభిక్షువులు నడుం బిగించారు. ఆలయం గోడలన్నిటికీ బంగారు పూత పూసేందుకు థాయ్‌లాండ్‌కు చెందిన బౌద్దులు ముందుకొచ్చారు. అనుకున్నదే తడవుగా.. ఏకంగా 3 వందల కిలోల బంగారాన్ని భారత్‌కు పంపారు. పూతను అమర్చేందుకు వీలుగా ఆలయంలో కెమికల్ ట్రీట్మెంట్ ఇప్పటికే పూర్తయింది.
15 వందల ఏళ్ల పురాతనమైన.. మహాబోధి ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. దీన్ని మరింత ఇనుమడింపజేసేందుకు… పసిడిమయం చేయనున్నారు. ఇందుకోసం 300 కిలోల బంగారాన్ని బుద్ధ గయ పట్టణంలో సిద్ధంగా ఉంచారు. 13 బాక్సుల్లో భద్రపరిచన బంగారానికి 24 మంది థాయ్‌లాండ్ గార్డులు కాపలా కాస్తున్నారు. ఈ గోల్డ్‌ను థాయ్‌లాండ్‌కు చెందిన బౌద్ధవులు విరాళంగా ఇచ్చారు. బ్యాంకాక్ నుంచి ప్రత్యేక విమానంలో బంగారం బుద్ధ గయకు చేరింది. ఆలయానికి బంగారు మెరుగులు దిద్దేందుకు… థాయ్‌లాండ్ నుంచి 12 మంది నిపుణులను రప్పించారు. 40 నుంచి 50 రోజుల్లోపు బంగారపు పూత పనులు పూర్తవుతాయని చెబుతున్నారు. సువర్ణ శోభితమయ్యే మహాబోధి ఆలయాన్ని వీక్షించే భక్తులు, పర్యాటకుల సంఖ్య రాబోయే రోజుల్లో మరింత పెరుగుతుందని బీహార్ ప్రభుత్వం ఆశిస్తోంది.