- వేడుకల్లో ఆకట్టుకున్న చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు
- వేడుకలకు దేశవిదేశాలనుంచి తరలివచ్చిన ప్రముఖులు,చిన్నారులు
- వారం రోజులపాటు అలరించనున్న జాతీయ, అంతర్జాతీయ చిత్రాలు
18వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవ వేడుకలు హైదరాబాద్‌లో వైభవంగా ప్రారంభమయ్యాయి. లలితా కళాతోరణంలో అట్టహాసంగా జరిగిన కార్యక్రమానికి కేంద్రమంత్రి మనీష్ తివారీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశవిదేశాలకు చెందిన సినీ ప్రముఖులు తరలివచ్చారు. వారం రోజలపాటు సందడి చేయనున్న ఫిల్మ్ ఫెస్టివల్లో జాతీయ, అంతర్జాతీయ చిత్రాలు పిల్లలను అలరించనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 550 మంది చిన్నారులు ఈ వేడుకల్లో సందడి చేయనున్నారు.
పిల్లల సినిమా పండుగతో భాగ్యనగరానికి కొత్త కళ వచ్చింది. వారం రోజులపాటు కనువిందు చేయనున్న 18 వ అంతర్జాతీయ చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హైదరాబాద్ వేదికైంది. లలిత కళాతోరంణంలో అట్టహాసంగా జరిగిన ప్రారంభ వేడుకలను కేంద్రమంత్రి మనీష్ తివారి, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి,రాష్ట్ర సమాచార శాఖామంత్రి డీకే అరుణ ప్రారంభించారు. దేశ, విదేశాల సినీప్రముఖులు, చిన్నారులు వేడుకలకు హాజరయ్యారు. ఫిల్మ్ ఫెస్టివల్లో చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
ఈ నెల 14 నుంచి 20 వరకు వారం రోజుల పాటు ఫిల్మ్ ఫెస్టివల్ సందడి చేయనుంది. ప్రధాన మార్గాల్లో, చిత్రాలు ప్రదర్శించనున్న థియేటర్ల వద్ద ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏనుగు బొమ్మలు, ఫ్లెక్సీలు అలరిస్తున్నాయి. పిల్లల సినిమా పండుగలో 48 దేశాలకు చెందిన మొత్తం 200 సినిమాలు ప్రదర్శించనున్నారు. దేశ, విదేశాల నుంచి వచ్చిన 550 మంది చిన్నారులు సినిమా పండుగలో సందడి చేయనున్నారు. సినిమాల ప్రదర్శనకు జంటనగరాల్లోని 10 థియేటర్లను ఎంపిక చేశారు. ఆయా సినిమా హాళ్లలో రోజుకు 30 చిత్రాలను పిల్లల కోసం ఉచితంగా ప్రదర్శిస్తారు. అన్ని భాషల నుంచి ఎంపిక చేసిన ఉత్తమ చిత్రాలను ప్రదర్శిస్తుండడంతో… నచ్చిన చిత్రాన్ని చూసి ఎంజాయ్ చేసేందుకు పిల్లలు ఉవ్విళ్లూరుతున్నారు. మొత్తం లక్షా యాభై వేల మంది చిన్నారులు ఈ చిత్రాలు చూస్తారని అంచనా. ఉత్తమ సినిమాలకు నాలుగు విభాగాల్లో పురస్కారాలు అందించనున్నారు. బాలల చలన చిత్రోత్సవాల్లో సందడి చేసేందుకు బాలీవుడ్ ప్రముఖులు తరలివచ్చారు. పెద్ద సంఖ్యలో టాలీవుడ్ తారలు పిల్లలతో ఆనందాన్ని పంచుకోనున్నారు.