పెరియాకుళం నుంచి చినమన్నూర్ చేరనున్న యాత్ర
నేటితో 1046 కిలోమీటర్లు పూర్తికానున్న పాదయాత్ర
మరో 4 రోజుల్లో శబరి చేరనున్న స్వాములు
శబరిగిరీషుడి దివ్యదర్శనం కోసం సువర్ణభూమి చేపట్టిన అయ్యప్ప స్వాముల 23వ మహాపాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. మరో నాలుగు రోజుల్లో అయ్యప్ప సన్నిధానానికి చేరనుండడంతో స్వాములు వేగంగా శబరిమలై దిశగా దూసుకెళ్తున్నారు. ఈ రోజు కొనసాగుతున్న 34వ రోజు పాదయాత్ర విశేషాలను ఇప్పుడు చూద్దాం.
సువర్ణభూమి అయ్యప్ప స్వాముల 23వ మహాపాదయాత్ర 34వ రోజుకు చేరింది. శబరిగిరీషుడి సన్నిధానానికి త్వరగా చేరుకోవాలనే ఆరాటంతో స్వాములు… వేకువజామునే అయ్యప్పకు పూజలు చేసి పెరియాకుళం నుంచి పాదయాత్ర మొదలు పెట్టారు. వడివడిగా అడుగులు వేస్తూ మధ్యాహ్నానికి థేనీ మీదుగా వీరపాండ్య టెంపుల్ చేరనున్నారు. అక్కడే భిక్ష చేసి ఆ తర్వాత పాదయాత్ర చేపడతారు. సాయంత్రానికి చినమన్నూర్ చేరుకుంటారు.
పాదయాత్ర చేస్తున్న స్వాములకు… హైదరాబాద్ కు చెందిన అయ్యప్ప భక్తులు భిక్ష, ఫలహారాలు, తాగునీరు అందించేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తుండడం విశేషం. హైదరాబాద్ లోని పాతబస్తీకి చెందిన రవి… నిన్న పెరియాకుళంలో స్వాములకు భిక్ష పెట్టారు. మరోవైపు కూకట్ పల్లికి చెందిన శ్రీనివాస్ తాగునీరు అందించి స్వాముల దాహం తీరుస్తున్నారు.
పాదయాత్ర చేస్తున్న అయ్యప్ప భక్తులు మార్గమధ్యంలో వచ్చే పవిత్ర నదులు, జలపాతాల్లో స్నానాలు, ఆలయాల్లో పూజలు చేస్తున్నారు. నిన్న కొడైకెనాల్ కు పెరియాకుళంకు మధ్యలో ఉన్న కొంబై కెనాల్ వాటర్ ఫాల్స్ లో స్నానాలు చేసి సేదతీరారు. దీనివల్ల అలసట తీరిందని, మరింత ఉత్సాహంగా నడకసాగిస్తామని అంటున్నారు స్వాములు.
ప్రస్తుతం తమిళనాడులో యాత్ర చేస్తున్న స్వాములు…. కొబ్బరితోటలు, మామిడితోటల మధ్య నుంచి ఆహ్లాదకర వాతావరణంలో ముందుకుసాగుతున్నారు. మరో నాలుగు రోజుల్లో అయ్యప్ప సన్నిధానానికి చేరనున్న స్వాములు ఇవాళ 37 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు. దీంతో యాత్ర 1046 కిలోమీటర్లు పూర్తవుతుంది.