- ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని నిర్ణయం
- సమైక్యాంధ్ర కోసం వాయిదా తీర్మానం ఇవ్వాలని నిర్ణయం
- ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ఎండగట్టే యోచన
అసెంబ్లీ సమావేశాల్లో సమైక్యవాణి విన్పించేందుకు వైసీపీ సిద్ధమవుతోంది. సమైక్య తీర్మానం చేయాలంటూ తొలిరోజే వాయిదా తీర్మానం ఇవ్వబోతోంది. దీంతో పాటు ఆయా ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు వైసీపీ ఎమ్మెల్యేలు రెడీ అవుతున్నారు.
అసెంబ్లీ వేదికగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమైక్యశంఖం పూరించబోతోంది. ఇప్పటికే రాష్ట్ర విభజనను వివిధ రూపాల్లో వ్యతిరేకిస్తున్న వైసీపీ..అసెంబ్లీ సమావేశాల్లోనూ అదే పంథా కొనసాగించనుంది. అసెంబ్లీ సమావేశాల్లో ప్రతి అవకాశాన్ని సమైక్యం కోసం వినియోగించుకోవాలని వైసీపీ భావిస్తోంది. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో విజయమ్మ చర్చించారు. సభ తొలిరోజు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ వాయిదా తీర్మానం ఇవ్వాలని నిర్ణయించారు. వాయిదా తీర్మానంపై చర్చ జరగకపోతే ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టే యోచనలో ఉన్నారు.
మరోవైపు రాష్ట్రంలో తాజా పరిస్థితులు ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని వైసీపీ భావిస్తోంది. ఇటీవల తుఫాను కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని…ప్రభుత్వ వైఫల్యాలను, విద్యుత్ ఛార్జీల పెంపుపై సభలో ప్రముఖంగా ప్రస్తావించనున్నారు. దీంతో పాటు కృష్ణ ట్రిబ్యూనల్ తీర్పు వల్ల రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం పై ప్రభుత్వాన్ని ఎండగట్టాలని వైసీపీ శాసన సభా పక్షం నిర్ణయించింది.