- టి-ముసాయిదాకు రాష్ట్రపతి ఓకే
- డ్రాఫ్ట్ బిల్లుపై ప్రణబ్ సంతకం
- హోంశాఖ నుంచి సీఎస్‌కు ఫైలు
- ఎల్లుండి సాయంత్రం బీఏసీ భేటీ
- సభలో చర్చపై తేలేది అప్పుడే..!
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణ ముసాయిదా బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేశారు. వాయువేగంతో రాష్ట్రానికి పంపేందుకు కేంద్ర హోంశాఖ ఏర్పాట్లు చేసింది. ఇవాళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి.. అటు నుంచి ముఖ్యమంత్రికి చేరుతుంది. అసెంబ్లీలో ఎప్పుడు చర్చకొస్తుందన్నది సస్పెన్స్‌గానే ఉంది.
విదేశీ పర్యటన నుంచి ఢిల్లీకి చేరుకోగానే.. రాష్ట్రపతి ప్రణబ్ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపైనే పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. నిన్న సాయంత్రం పూర్తిస్థాయిలో పరిశీలించి.. సంతకం చేసినట్టు సమాచారం. అసెంబ్లీ అభిప్రాయం చెప్పేందుకు ఆరు వారాల సమయం నిర్దేశించినట్టు తెలుస్తోంది. ఈలోగా తనకు తిరిగి పంపాలని ప్రణబ్ ఆదేశం.
తన విధి పూర్తవగానే రాష్ట్రపతి ప్రణబ్.. దాన్ని కేంద్ర హోంశాఖకు పంపించేశారు. అక్కడి నుంచి రాష్ట్ర అసెంబ్లీకి ముసాయిదా బిల్లు వస్తుంది. ఇప్పటికే ప్రత్యేక అధికారిని నియమించిన హోంశాఖ… నేరుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతికి చేరవేస్తుంది. ఆయన నుంచి ముఖ్యమంత్రికి డ్రాఫ్ట్ అందుతుంది.
రాజ్యాంగం నిర్దేశించిన ప్రకారమే.. తెలంగాణ ముసాయిదా బిల్లు స్పీకర్ కార్యాలయానికి చేరనుంది. అసెంబ్లీ సమావేశాలు కూడా ఇవాళ్టి నుంచే ప్రారంభం అవుతుండడంతో.. ఎల్లుండి జరిగే బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం కీలకంగా మారనుంది. శాసనసభ అభిప్రాయం కోసం రాష్ట్రపతి పంపిన ముసాయిదాపై ఎప్పుడు చర్చించాలన్న అంశం బీఏసీలో ఖరారవుతుందని సమాచారం.