ఆఖరి అవకాశాన్ని ఉపయోగించుకొనేందుకు సీఎం కిరణ్ ప్రయత్నిస్తున్నారు. తెలంగాణాకు వ్యతిరేకంగా మొదటి నుంచి పావులు కదుపుతున్న ముఖ్యమంత్రి, రాష్ట్రపతి ప్రణబ్‌తో ఆంతరంగికంగా సమావేశమయ్యారు. రాష్ట్ర విభజన, తెలంగాణ ఏర్పాటు లోటుపాట్లపై సుదీర్ఘంగా చర్చించారు.
విభజన అడ్డుకొని తీరుతాం. సీఎం కిరణ్ ఎప్పటి నుంచో చెబుతున్న మాట. కానీ బిల్లు అసెంబ్లీకి వచ్చిన తర్వాత ఆయనలో మార్పొచ్చింది. స్పీడు తగ్గింది. బిల్లు శాసనసభలో టేబుల్ అయినా సన్నిహితుల దగ్గర మాత్రం విభజన జరగదనే ధీమా వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఆఖరి బాల్ వరకు ఆట అయినట్లు కాదన్న ఆయన లాస్ట్ ఓవర్లో కొత్త రూట్లో వెళ్తున్నారు. ఓవైపు విభజన బిల్లు రాష్ట్రానికొచ్చింది. అదే సమయంలో రాష్ట్రపతి హైదరాబాద్‌కొచ్చారు. దీంతో రాష్ట్ర నేతలంతా ప్రణబ్ ముందు క్యూ కట్టారు.
తెలంగాణ ఏర్పాటును మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న ముఖ్యమంత్రి ఆఖరి నిమిషంలో ప్రతీ అంశాన్ని వినియోగించుకుంటున్నారు. బొల్లారంలోని రాష్ట్రపతినిలయంకు వెళ్ళిన సీఎం దాదాతో గంటపాటు ఆంతరంగికంగా సమావేశమయ్యారు. విభజన సమస్యపైనే ఆయనతో ప్రత్యేకంగా చర్చించినట్లు సమాచారం. విభజన వల్ల తలెత్తే సమస్యలను రాష్ట్రపతికి వివరించారని తెలుస్తోంది. విభజన జరిగితే ఇరు ప్రాంతాలకు నష్టం జరుగుతుందని చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రధానంగా తాగునీరు, సాగునీటి ప్రాజెక్టులు, నిరుద్యోగం, విద్యుత్, సరిహద్దుల వంటి పలు సమస్యలు వస్తాయని కిరణ్, దాదాకు వివరించారు. హైదరాబాద్, భద్రాచలం, ఉమ్మడి రాజధాని వంటి అంశాలను ప్రణబ్‌కు వివరించారు కిరణ్.
బిల్లు అసెంబ్లీకి వచ్చినా అంతా తప్పుల తడకగా ఉందన్న విషయాన్ని కిరణ్ ప్రణబ్ దృష్టికి తీసుకెళ్ళినట్లు తెలుస్తోంది. ముసాయిదా బిల్లులో పూర్తిస్థాయి వివరాలు లేవని, బిల్లులోని అంశాలపై దాదాకు వివరణ ఇచ్చారని ఆయన సన్నిహిత వర్గాలంటున్నాయి. మరోవైపు విభజనపై సమాంధ్ర ప్రజాప్రతినిధుల నుంచి వ్యక్తమవుతోన్న భయాందోళనలను పూస గుచ్చినట్లు వివరించారు. అయితే సీఎం చెప్పిన అన్ని విషయాలను శ్రద్ధగా విన్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే బిల్లును పూర్తి స్థాయిలో పరిశీలించి అసెంబ్లీకి పంపిన రాష్ట్రపతి, సీఎం చెప్పిన అభ్యంతరాలను పరిశీలిస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
రాష్ట్రపతి హైదారబాద్కొస్తే కేవలం సీఎం ఒక్కరే వెళ్ళి కలవడంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.