- కేరళలో నరేంద్రమోడీ సుడిగాలి పర్యటన
- కోచి, తిరువనంతపురంలో మోడీ బహిరంగ సభలు
- మైనార్టీలు, బీసీలపై దృష్టి సారించిన మోడీ
- కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించిన మోడీ
- తిరువనంతపురంలో మోడీ సభకు భారీ స్పందన
- ఎల్డీఎఫ్, యూడీఎఫ్‌పై నిప్పులు చెరిగిన మోడీ
- ప్రత్యామ్నయంగా బీజేపీని ఎంచుకోవాలన్న మోడీ
టార్గెట్ సౌత్… హస్తిన కోటలో పాగా వేసేందుకు.. బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ ఎంచుకున్న మార్గం ఇది. ఇందులో భాగంగా ఆయన దక్షిణాది రాష్ట్రాల్లో కలియతిరుగుతున్నారు. కేరళలోని కొచ్చి, తిరువనంతపురం.. బహిరంగ సభలకు హాజరైన మోడీ… సుస్థిర పాలనకు ఓటెయ్యాలని ప్రజలను కోరారు. కేరళలో బీజేపీకి కనీస ప్రాతినిధ్యం లేకున్నా.. మోడీ సభలకు భారీ సంఖ్యలో జనం తరలిరావడం కమలనాథుల్లో నూతనోత్తేజాన్ని నింపింది.
కేరళలో నరేంద్ర మోడీ పర్యటన బీజేపీలో కొత్త జోష్ నింపింది. సార్వత్రిక ఎన్నికల ముందస్తు ప్రచారంలో భాగంగా.. దేశవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్న మోడీ… ఆదివారం కేరళలోని కొచ్చి, తిరువనంతపురంలో జరిగిన బహిరంగ సభల్లో ప్రసంగించారు. మధ్యాహ్నం కొచ్చిలో జరిగిన సమావేశానికి హాజరైన మోడీ.. ఆ ప్రాంతంలో అధిక సంఖ్యాకులైన.. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతిపై ప్రధానంగా దృష్టి సారించారు. పేదల పేరు చెప్పి ఓట్లు సంపాదించిన కాంగ్రెస్… చేసిన వాగ్దానాల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని మోడీ విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వస్తే… ప్రజల కలలను సాకారం చేస్తామని హామీ ఇచ్చారు.
సాయంత్రం కేరళ రాజధాని తిరువనంతపురంలో జరిగిన సభకు హాజరైన మోడీ… అధికార, విపక్షాలైన యూడీఎఫ్, ఎల్డీఎఫ్పై మండిపడ్డారు. ఈ రెండు పక్షాలు అధికారంలో కోసం చీకట్లో ఒప్పందాలు చేసుకుంటున్నాయని.. ఈ రెండింటికీ పెద్ద తేడా ఏమీ లేదని విమర్శించారు. దశాబ్దాలుగా ఈ రెండు కూటములే పాలిస్తున్నా.. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి ఏంటని ప్రశ్నించారు. కేరళ ప్రజలు మూడో ప్రత్యామ్నయంగా బీజేపీని ఎంచుకోవాలని కోరారు.
బీజేపీకి ఒక్కటంటే ఒక్క సీటు కూడా లేని రాష్ట్రంలో… మోడీ సభలకు పెద్ద సంఖ్యలో జనం తరలిరావడం.. పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపింది. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా కేరళలో బోణీ కొట్టి తీరుతామని.. కమలనాథులు ధీమాగా చెబుతున్నారు.