- రాజ్యసభకు టి-బిల్లు: పీటీఐ కథనం
- ప్రణబ్ ఆమోదముద్రపై అనుమానాలు అక్కర్లేదు
- తేలాల్సింది బీజేపీ మద్దతు గురించే..!
- డైరెక్ట్‌గా రంగంలోకి దిగనున్న ప్రధాని
- సుష్మా, జైట్లీతో మన్మోహన్ చర్చించే అవకాశం
- బిల్లుకు బీజేపీ మద్దతిస్తుందని భావిస్తున్న కాంగ్రెస్
- బీజేపీ మద్దతిస్తే ఒకేరోజు రెండు సభల్లో బిల్లు
తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టడంపై ఇవాళ్టి నుంచి అడుగడుగునా సస్పెన్స్ నడవబోతోంది. రాష్ట్రపతి సంతకం నుంచి.. బిల్లు సభలోకి వచ్చేంత వరకు ప్రతి అంకం ఉత్కంఠ రేకెత్తించేదే. ఇంతకీ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై ఇవాళ ఎలాంటి పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలున్నాయి. లెట్స్ వాచ్ ద స్టోరీ.
టీ-బిల్లుపై ఏం జరగనుందన్నది ఇవాళ్టితో తేలనుంది. ఇప్పటికే బిల్లు రాష్ట్రపతికి చేరింది. బిల్లుపై ఇవాళ ప్రణబ్ ఆమోదముద్ర వేస్తారని.. ఆ వెంటనే బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టే అవకాశం ఉందన్నది పీటీఐ కథనం. ఎన్ని అడ్డంకులు వచ్చినా విభజనపై ముందుకే వెళ్లాలని కాంగ్రెస్ భావిస్తుండడంతో ప్రణబ్ ఆమోదముద్రపై అనుమానాలు అక్కర్లేదు. రాష్ట్రపతి సంతకం అయ్యాక బిల్లు హోంశాఖకు, అక్కడి నుంచి పార్లమెంట్‌కు వస్తుంది. అయితే, పార్లమెంట్లో బిల్లు ఎలా ప్రవేశపెడతారు.. దీనికి బీజేపీ ఏ మేరకు మద్దతిస్తుందన్నదే తేలాల్సి ఉంది. ముఖ్యంగా ప్రధానప్రతిపక్షమైన బీజేపీ మద్దతు లభిస్తే.. బిల్లు పాస్ కావడం నల్లేరు మీద నడకే అవుతుంది. అందుకే… ఆ పార్టీని ఒప్పించేందుకు డైరెక్ట్‌గా ప్రధానమంత్రే రంగంలోకి దిగనున్నారు.
ప్రధాన ప్రతిపక్ష నేతలు సుష్మా, అరుణ్‌జైట్లీతో మన్మోహన్ ఈ అంశంపై చర్చించనున్నారు. బిల్లును సభలో ప్రవేశపెట్టడం, దానిపై చర్చించడం.. ఆందోళనకు దిగే సీమాంధ్ర ఎంపీలను కట్టడి చేయడం తదితర అంశాలపై వారి సహకారం కోరనున్నారు. ఇచ్చిన సవరణలపై బలమైన వాదన వినిపించేందుకు బీజేపీ సిద్ధమైనా… అల్టిమేట్‌గా బిల్లుకు ఆమోదం తెలుపుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. మొత్తం మీద బీజేపీ నేతలతో ప్రధాని చర్చించిన తరువాత బిల్లును ఎప్పుడు, ఎక్కడ ప్రవేశపెట్టాలన్న దానిపై ఓ క్లారిటీ వస్తుంది. బీజేపీ గనక బిల్లుకు మద్దతిస్తాం అని ప్రకటిస్తే… మంగళవారం ఉదయం లోక్‌సభలో, మధ్యాహ్నం రాజ్యసభలో బిల్లు పెట్టేందుకు కాంగ్రెస్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. ఒకవేళ ప్రతిపక్షం నుంచి సహకారం అందకపోతే మాత్రం రాజ్యసభలో పెట్టి- బీజేపీ వైఖరి ఏంటో తెలుసుకోవాలనుకుంటోంది కాంగ్రెస్. రాజ్యసభలో ప్రవేశపెట్టడం ద్వారా.. బిల్లును గట్టెక్కించే పూర్తి బాధ్యత బీజేపీపైనే పడుతుంది. కాబట్టి ఈ విషయంలో ఆ పార్టీ స్టాండ్ ఏంటో తెలిసిపోతుంది గనక.. కాంగ్రెస్ ఈ వ్యూహాన్ని అమలు చేయాలని చూస్తోంది. ఏదేమైనా బీజేపీతో చర్చించిన తరువాత తెలంగాణ బిల్లును ఎప్పుడు, ఎక్కడ ప్రవేశపెట్టబోయేది స్వయంగా ప్రధానమంత్రే ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.