- కీలకంగా మారిన ఫిబ్రవరి 17…
- సమైక్య నినాదాలతో మార్మోగనున్న ఢిల్లీ
- జంతర్ మంతర్ వద్ద జగన్ సమైక్య సమరం
- రాంలీలా మైదానంలో ఏపీఎన్జీవోల ధర్నా
- పార్లమెంటులో టీ-బిల్లు ప్రవేశంపై క్లారిటీ!
ఫిబ్రవరి 17.. ఇప్పుడు అందరి దృష్టి ఆ తేదీపైనే..ఇంతకు ఆరోజు ఏం జరుగబోతోంది? రాష్ట్ర చరిత్రలో మరో కీలక పరిణామం చోటుచేసుకోనుందా? రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఘట్టం ఆవిష్కృతం కానుందా?..
17 వతేదీ…ఏం జరుగబోతోందన్న ఉత్కంఠ కొనసాగుతోంది. అందరి చూపూ ఆ తేదీపైనే. కారణం ఆరోజు రాష్ట్ర చరిత్రలో కీలక పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయి. హస్తిన వీధులు సమైక్య నినాదంతో మార్మోగనున్నాయి. రాష్ట్ర విభజన అంశం తుదిఘట్టానికి చేరడంతో, ఎలాగైనా అడ్డుకునేందుకు సమైక్యావాదులు ప్రయత్నిస్తున్నారు. ప్రధానంగా విభజన ప్రకటన వచ్చిన నాటినుంచి సమైక్య సమరం సాగిస్తున్న వైసీపీ అధినేత జగన్ 17న జంతర్ మంతర్ వద్ద సమైక్య ధర్నాకు దిగుతున్నారు. అధినేతకు మద్దతుగా వేలాదిమంది కార్యకర్తలు కదన కుతూహలంతో రెండు ప్రత్యేక రైళ్లలో ఢిల్లీ వెళ్తున్నారు..
మరోవైపు సమైక్యఉద్యమాన్ని ఆదినుంచి తమ భుజాలమీద మోస్తున్న ఏపీఎన్జీవోలు 17, 18 తేదీల్లో రాంలీలా మైదానంలో మహా ధర్నాకు రెడీ అవుతున్నారు. అటు అధిష్టానంపై ధిక్కార స్వరం వినిపిస్తూ, ఇటీవల ఢిల్లీలో మౌనదీక్ష చేసిన, సీఎం కిరణ్ 18న సీమాంధ్ర ఉద్యోగుల ధర్నాలో పాల్గొంటారని తెలుస్తోంది. దీంతో రాష్ట్ర విభజన సెగలతో ఢిల్లీ వేడెక్కనుంది.
మరోవైపు…రాష్ట్ర భవిష్యత్తు పార్లమెంటు ముంగిట్లో కొట్టుమిట్టాడుతోంది. టీ-బిల్లు లోక్‌సభలో ప్రవేశించిందో లేదో తెలియని సందిగ్ధం కొనసాగుతోంది. గురువారం లోక్‌సభలో జరిగిన ఘటన.. దేశాన్ని నివ్వెరపోయేలా చేస్తే, రాష్ట్రం అయోమయానికి గురైంది. బిల్లు ప్రవేశ పెట్టామని హోంమంత్రి షిండే, పార్లమెంటు వ్యవహారాల మంత్రి కమలనాథ్ ప్రకటిస్తుంటే, ప్రధాన ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్ మాత్రం ప్రవేశ పెట్టలేదంటున్నారు. ప్రవేశ పెట్టినట్టేనని సీపీఐ చెబుతున్నా, అది సరైన పద్దతి కాదంటోంది. సోమవారం దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
మొత్తమ్మీద.. 17న పార్లమెంటు లోపల టీ-బిల్లుపై తర్జన భర్జన జరిగే సయంలోనే, బయట సమైక్యవాదులు కేంద్రంపై సమర శంఖం పూరించనున్నారు. దీంతో ఆరోజు సంభవించనున్న పరిణామాలు ఎలా ఉంటాయన్నది హాట్ టాపిక్‌గా మారింది..