మల్కాజ్‌గిరిపై అన్ని పార్టీల ఫోకస్..

రానున్న ఎన్నికలకు మల్కాజ్‌గిరి పార్లమెంట్ స్థానం హాట్ కేక్‌గా మారుతోంది. రాష్ట్ర విభజన జరిగినా సరే.. ఇక్కడి నుంచి పోటీ చేయడానికి ఇటు తెలంగాణా వాదులు , ఇటు సీమాంధ్ర నాయకులు భారీగా పోటీపడుతున్నారు. సెటిలర్లతో పాటు విద్యాధికులు ఎక్కువగా ఉండటంతో.. అన్నిపార్టీల నేతలు మల్కాజ్‌గిరి స్థానంపై కర్చీప్ వేసుకొనేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు.

రానున్న ఎన్నికల్లో మల్కాజ్‌గిరి స్థానం హాట్‌టాపిక్‌గా మారనుంది. ఎవరు పోటీ చేసినా సరే.. కాస్త కష్టపడితే చాలు… గెలిచే అవకాశాలుండటంతో.. నేతలు సీరియస్‌గా తమ ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు.మల్కాజ్‌గిరి పార్లమెంట్ స్థానం నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు బరిలో దిగుతారనే వార్తలు వస్తున్నాయి. టీఆర్ఎస్‌, కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీని రక్షించడానికి.. తెలంగాణా నుంచి బాబును పోటీచేయించాలనే ఉద్దేశ్యంతో తెలంగాణా టీడీపీ నాయకులు  ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు మల్కాజ్‌ గిరిలో సెటిలర్ల ఓట్లు అధికంగా ఉండటం, దీంతోపాటే పార్టీకి కూడా బలమైన క్యాడర్ ఉండటంతో బాబు కూడా ఇక్కడినుంచి పోటీ చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీ, బీజేపీ కూటమిగా పోటీచేస్తే.. ఇక్కడ ఎక్కువ శాతం ఉన్న బ్రాహ్మణ వర్గం  ఓట్లు తమకు అనుకూలంగా పడే అవకాశం ఉందని టీడీపీ నాయకులు భావిస్తున్నారు. చంద్రబాబు పోటీలో ఉండే అవకాశం ఉందని రంగారెడ్డి జిల్లా టీడీపీ అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించడం విశేషం.

మరోవైపు వైసీపీ నేత షర్మిల కూడా మల్కాజ్‌గిరి స్థానం నుంచి బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే.. షర్మిలను తెలంగాణాలో వైసీపీ అధ్యక్షురాలిగా నియమించాలనే డిమాండ్లు పార్టీలో వినిపిస్తున్నాయి. దీనికి తగ్గట్టే…. వైసీపీని బరిలో దించాలని పార్టీ భావిస్తోంది.  మల్కాజ్‌గిరి పార్లమెంట్ స్థానం పరిధిలో మైనార్టీల ఓట్లు, క్రిష్టియన్ల ఓట్లు ఎక్కువగా ఉండటంతో షర్మిల గెలుపు సునాయాశమౌతుందనే భావన పార్టీలో నెలకొంది. సమైక్యవాదాన్ని వైసీపీ బలంగా వినిపించిందనే భావన సెటిలర్లలో ఉండటం.. దీనికి తోడు రెడ్డి సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉండటం.. వైసీపీకి కలిసొచ్చే అంశాలు.

ఇక లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ కూడా మల్కాజ్‌ గిరి స్థానంపై కన్నేసినట్లు తెలుస్తోంది. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలనే ఉద్దేశ్యంతో ఉన్న జేపీ.. మల్కాజ్‌ గిరి స్థానమైతే సురక్షితంగా ఉంటుందని భావిస్తున్నారు. దీనికి తోడు.. గతంలో లోక్‌సత్తా నుంచి పోటీచేసిన విజ్ఞాన్ రత్తయ్యకు చెప్పుకోదగ్గ ఓట్లు రావడం విశేషం.  సెటిలర్లు ఎక్కువగా ఉండటం, దీంతో పాటే మల్కాజ్‌ గిరి పార్లమెంట్ స్థానంలో అత్యధికులు విద్యాధికులు కావడం, వీటన్నింటికన్నా.. 2009లో జేపీ ఎమ్మెల్యేగా గెలిచిన కూకట్ పల్లి నియోజకవర్గం.. మల్కాజ్‌గిరి పరిధిలో ఉండటం జేపీకీ కలిసొచ్చే అంశాలు.

ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ, కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ కూడా మళ్లీ మల్కాజ్‌గిరి స్థానంపై కన్నేశారు. జనరల్ స్థానమైనా సరే.. 2009 ఎన్నికల్లో ఎస్సీ అభ్యర్థిగా బరిలోకి దిగిన సర్వే మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.  దళితుల ఓట్లు కూడా చెప్పుకోదగిన సంఖ్యలో ఉండటం, కేంద్ర మంత్రిగా సర్వే చేసిన అభివృద్ధి పనులు ఆయనకు సానుకూలాంశాలు. అయితే సర్వేపై వ్యతిరేకతతో ఉన్న స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సర్వేకు టికెట్‌ ఇవ్వొద్దంటూ హైకమాండ్‌ దగ్గర గట్టి లాబీయింగ్ చేస్తున్నారు. దీంతో  ఎందుకైనా మంచిదనే ఉద్దేశ్యంతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానంపై కూడా సర్వే కన్నేశారు. ఒకవేళ తెలంగాణా రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ఎస్సీకి అవకాశం కల్పిస్తే.. హైకమాండ్ ఆశీస్సులున్న తనకే సీఎం పదవి దక్కుతుందనే అంచనాతో సర్వే ఉన్నట్లు తెలుస్తోంది.

మరోవైపు సహజనటి జయసుధను వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీ మల్కాజ్‌గిరి పార్లమెంట్ అభ్యర్థిగా తెరమీదకు తీసుకొస్తోంది. సినిమా గ్లామర్, వివాద రహితంగా ఉండటం, మహిళ కావడం జయసుధకు కలిసొచ్చే అంశాలు. దీనికి తోడు బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన జయసుధకు నియోజకవర్గ పరిధిలో ఎక్కువ సంఖ్యలో ఉన్న బ్రాహ్మణ సామాజిక వర్గపు ఓట్లు గుంపగుత్తగా పడతాయని కాంగ్రెస్ భావిస్తోంది. మరోవైపు సెటిలర్లు, క్రిష్టియన్లు ఎక్కువగా ఉండటం జయసుధకు అదనపు బలాలు.

టీడీపీ నుంచి రేవంత్ రెడ్డి కూడా మల్కాజ్‌ గిరి స్థానం నుంచి పోటీ చేసేందుకు వ్యూహాత్మంగా పావులు కదుపుతున్నారు. ఒకవేళ చంద్రబాబు మల్కాజ్‌ గిరి నుంచి పోటీ చేయకపోతే..తనకు అవకాశం ఇవ్వాలని రేవంత్‌ రెడ్డి కోరుతున్నారు. ఇదే వ్యూహంతో గత రెండేళ్లుగా నియోజకవర్గానికి చెందిన నేతలతో రేవంత్‌ రెడ్డి సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్నారు. యువనేత కావడం, తెలంగాణావాదాన్ని గట్టిగా వినిపిస్తుండటం రేవంత్‌రెడ్డికి సానుకూల అంశాలు.మొత్తం మీద తెలంగాణా ఉద్యమ ప్రభావం ఉన్నా సరే.. సెటిలర్లు ఎక్కువగా ఉండటంతో ఆశావహుల చూపులన్నీ మల్కాజిగిరి పార్లమెంట్ స్థానంపైనే కేంద్రీకృతమై ఉన్నాయి.

Advertisements
Video | This entry was posted in Hyderabad News and tagged , , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s