- కొత్త పార్టీకి కిరణ్ సన్నాహాలు!
- హితులతో ఇవాళ తుది చర్చలు
- ఏదో ఒకటి చెప్తారా.. నానుస్తారా?
- విభజనపై న్యాయ పోరాటం
- కిరణ్ పిటిషన్పై రేపు విచారణ!
కొత్త పార్టీపై ఊరిస్తూ వచ్చిన కిరణ్ ఇవాళ తేల్చేయనున్నారు. రాష్ట్ర విభజనపై న్యాయ పోరాటం మొదలుపెట్టిన ఆయన ఎన్నికల సమరాంగణానికి ఎలా వెళ్తారనే ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. కాంగ్రెస్ బహిష్క్రత ఎంపీలతో సమావేశమై కార్యాచరణ ప్రకటిస్తారు.
రాష్ట్ర విభజనలో భాగస్వామి కాలేనంటూ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీపై లోతైన కసరత్తే చేశారు. ఎన్నికల్లో ప్రజల ముందుకు ఎలా వెళ్లాలి.. ఆదరిస్తారా.. లేదా.. అనే అంశాలపై వివిధ కోణాల్లో సర్వేలు చేయించి జనం నాడి పట్టే ప్రయత్నం చేశారు. సీమాంధ్రలో హస్తం గుర్తుపై పోటీ చేయలేమని కంగారు పడుతున్న కాంగ్రెస్ నాయకులకు ఇప్పుడు కిరణే ఆశాదీపం. వాళ్ల నుంచి ఎదురవుతున్న ఒత్తిడికి తోడు మున్సిపల్ నగారా మోగడం.. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుండడంతో ఏదో ఒకటి తేల్చాల్సిన అనివార్యత ఎదురైంది.
కాంగ్రెస్ బహిష్కృత ఎంపీలతో తన వర్గం ప్రజా ప్రతినిధులతో కిరణ్ కీలక ఏర్పాటు చేశారు. ఆయన కొత్త పార్టీకే మొగ్గుచూపుతున్నట్టు సమాచారం. జెండా, అజెండా ఇప్పటికే సిద్ధమైనట్టు చెప్తున్నారు. సీమాంధ్రలో బహిరంగ సభ పెట్టి.. కొత్త పార్టీని ప్రకటించే అవకాశం ఉందని కిరణ్ సన్నిహితులు అంటున్నారు.
మరోవైపు.. రాష్ట్రాన్ని విడదీయడంపై మాజీ ముఖ్యమంత్రి కిరణ్ న్యాయపోరాటం మొదలుపెట్టారు. కేంద్రం తీరు రాజ్యాంగ విరుద్ధంగా ఉందంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. నదీ జలాల పంపిణీ, ఆర్టికల్ 371-డి, ఉమ్మడి రాజధానిపై కేంద్రం తీరును పిటిషన్లో పేర్కొన్నారు. బిల్లులో లోపాల ఉన్నాయని, అసెంబ్లీ తిరస్కరించిందని కూడా ప్రస్తావించారు. విభజన వల్ల రెండు రాష్ట్రాల ప్రజలు నష్టపోతారని పిటిషన్లో సుప్రీం దృష్టికి తీసుకెళ్లారు. కిరణ్ పిటిషన్ విచారణకు వస్తే కోర్టు ఏ చెప్తుందన్నది ఉత్కంఠగా మారింది.