– మోడీకి సంపూర్ణ మద్దతు ప్రకటించిన పవన్
– మోడీకే.. నిర్ణయాధికారం ఉంటే ఇలా జరిగేది కాదు..
– కల్యాణ్, కమలం రూట్ క్లియర్..
– తెలంగాణలో పవన్ పవర్ కలిసివస్తుందనుకుంటున్న బీజేపీ
– పవర్ స్టార్ రూపంలో బ్రహ్మాస్త్రం దొరికినట్లేనా?
– టీఆరెస్, కాంగ్రెస్‌ను కార్నర్ చేస్తున్న పవన్ కల్యాణ్
– పవన్‌తో యూత్ కలిసి వస్తారనుకుంటున్న టీ.బీజేపీ నేతలు
– లోటస్‌కు పవర్ స్టామినా జత కలిస్తే తిరుగుండదా?
పవన్ కల్యాణ్‌తో దోస్తీ తెలంగాణలో ఎంతకైనా మంచిదే అనుకుంటోంది కమలం పార్టీ. మోడీకి తన సంపూర్ణ మద్దతు ప్రకటించిన పవన్… రాష్ట్ర విభజన సమయంలో బీజేపీ వ్యవహరించిన తీరును సమర్థించారు. జనసేనానిగా తన తొలి ప్రసంగంలో తెలంగాణపై ప్రేమ కురిపించడం ద్వారా ఇక్కడి యువతను ఆకట్టుకున్నారు. అందుకే పవర్‌స్టార్‌తో లెక్కలు సెట్టవుతాయన్న భావనలో కమలం నేతలున్నారు.
జనసేన స్థాపిస్తూనే కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన పవన్ కల్యాణ్ బీజేపీతో జట్టు ఖాయమే అని తేల్చేశారు. అహ్మదాబాద్‌లో మోడీతో 40 నిమిషాల పాటు మంతనాలు జరిపిన పవన్.. తన సంపూర్ణ మద్దతు మోడీకే ఉంటుందని ప్రకటించారు. బీజేపీతో కలిసి పని చేస్తానన్నారు. మోడీ చేతిలో నిర్ణయాధికారం ఉంటే.. ఇంత ఘోరంగా రాష్ట్ర విభజన జరిగి ఉండేది కాదని.. రెండు ప్రాంతాల ఆమోదయోగ్యంతో తెలుగు ప్రజలు భౌగోళికంగా విడిపోయి ఉండే వారన్న వాదన వినిపించారు. కల్యాణ్‌కు కమలం రూట్ క్లియర్ అవడంతో.. తెలంగాణలో పవన్ పవర్‌ను వినియోగించుకోవాలని టీ.బీజేపీ నేతలు భావిస్తున్నారు. బీజేపీకి సంపూర్ణ మద్దతు ప్రకటించడంతో.. లోలోపల ఖుషీ అవుతున్నారు. పవర్ స్టార్ రూపంలో బ్రహ్మాస్త్రం దొరికిందని అనుకుంటున్నారు.
జనసేన పార్టీ ఆవిర్భావ సభలో పవన్ తెలంగాణం పూర్తిస్థాయిలో వినిపించారు. విభజనకు వ్యతిరేకం కాదని.., కేవలం విభజించిన తీరుకే వ్యతిరేకమంటూ.. బీజేపీ చెప్పిన మాటలను ప్రస్తావించారు. తెలంగాణలో టీఆరెస్‌ను, కాంగ్రెస్‌ను టార్గెట్ చేయడం ద్వారా… పవర్ ప్లవర్‌కు పూర్తిస్థాయిలో దగ్గరయ్యారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేనతో బీజేపీ జట్టుకట్టడం ఖాయంగానే కనిపిస్తోంది. తెలంగాణలో టీడీపీ నుంచి వలసలు పెరిగిపోవడంతో.. ఇక్కడ ఆ పార్టీ కాకపోయినా.. పవన్ రూపంలో భారీగా యూత్ ఓట్లు ఎట్రాక్ట్ చేయవచ్చని టీ.కమలం నేతలు భావిస్తున్నారు. దేశ సమగ్రత, తెలుగుజాతి సుఖ సంతోషాల కోసం పోరాడుతున్న పవన్.. బీజేపీతో కలిస్తే మరింత శక్తిమంతంగా అనుకున్న లక్ష్యాలు సాధించవచ్చని సూత్రీకరిస్తున్నారు. తెలంగాణలో లోటస్‌కు పవర్ స్టామినా జత కలిస్తే తిరుగుండదని కొందరు నేతలనుకుంటున్నారు. మరి రాబోయే రోజుల్లో పొత్తులు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారుతోంది.