హిమాచల్ ప్రమాదంపై సర్వత్రా దిగ్భ్రాంతి

తెలుగు విద్యార్థుల విహారయాత్ర విషాదంగా మారింది. హిమాచల్‌ప్రదేశ్‌ వెళ్లిన హైదరాబాద్‌ ఇంజనీరింగ్‌ విద్యార్థులు ప్రమాదానికి గురయ్యారు. ఫోటోలు దిగడానికి వెళ్లిన 24మంది.. బియాస్‌ నదిలో కొట్టుకుపోయారు. సహాయకచర్యలు ప్రారంభించిన హిమాచల్‌ప్రదేశ్‌ పోలీసులు.. విద్యార్థుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. తెలంగాణ హోంమంత్రి నాయిని, ఐఏఎస్‌ అధికారుల బృందం సహాయకచర్యలను పర్యవేక్షించడానికి హిమాచల్‌ప్రదేశ్‌ వెళ్లారు.

 

విహారయాత్ర విషాదంగా మారింది.. కన్నవారి గుండెల్లో ఆందోళన నింపింది. అప్పుటి వరకు ఆడుతూపాడుతూ తిరిగిన విద్యార్థులు కనిపించకుండా పోయారు.. ఏమయ్యారో తెలియదు.. బతికే ఉన్నారో.. మరేమైనా జరగకూడనిది జరిగిందో తెలియదు.. హైదరాబాద్‌ నుంచి హిమాచల్‌ప్రదేశ్‌ వెళ్లిన 49మంది విద్యార్థుల బృందంలో.. 24మంది జాడలేదు. ఇటు తల్లిండ్రులు.. అటు స్నేహితులు, బంధువుల్లో ఒక్కటే అందోళన.. పట్టరాని ఆవేదన..

ఈనెల 3న హైదరాబాద్‌లోని వీఎన్‌ఆర్‌ విజ్ఞాన్‌జ్యోతి ఇంజనీరింగ్‌ కాలేజీ నుంచి 49 మంది విద్యార్థులు.. ఆరుగురు ఫ్యాకల్టీ విహారయాత్రకు వెళ్లారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని కులు-మనాలితో పాటు అనేక ప్రాంతాలను సందర్శిస్తూ వచ్చారు. ఇదే క్రమంలో మండిలోని బియాస్‌ నది వద్దకు చేరుకున్న విద్యార్థులు.. ఫోటోలు దిగడానికి వెళ్లారు. ఇంతలోనే ల్యార్జీ డ్యాం నుంచి నీళ్లు వదలడంతో.. దారుణం జరిగిపోయింది. కొంతమంది ఏదోలా బయటపడగా.. 24మంది మాత్రం నీటిలో చిక్కుకుపోయారు. అప్పటికే చీకటి పడటంతో ప్రవాహాన్ని గుర్తించలేక నీటిలో కొట్టుకుపోయారు.

గల్లంతైన విద్యార్థుల్లో 18మంది అబ్బాయిలు, ఆరుగురు అమ్మాయిలు ఉన్నారు. ఆచూకీ తెలియకుండా పోయిన విద్యార్థులను.. అఖిల్ మాచర్ల, అశీష్ మంతా, దేబాశిష్‌ బోస్, కల్లూరి శ్రీహర్ష, కిరణ్‌కుమార్ మరికుల, రిధిమా పాపాని, బైరినేని రిత్విక్, సందీప్ బస్వరాజ్, విజేత ఆకుల, అఖిల్, రాంబాబు, ఉపేంద్ర, విష్ణు, శివ, పరమేశ్‌, సాయిరాజ్‌, షబ్బీర్‌, ఐశ్వర్య, గాయత్రి, తరుణ్‌, అరవింద్‌ లుగా గుర్తించారు. విద్యార్థులంతా ఇనుస్ట్రుమెంటేషన్‌ ఇంజనీరింగ్‌లో సెకండ్‌ఇయర్‌ చదువుతున్నారు.. కళ్ల ముందే తమ మిత్రులు నీటిలో కొట్టుకుపోవడంతో స్నేహితులు కన్నీరుమున్నీరవుతున్నారు. పట్టరాని దుఖంతో బోరునవిలపిస్తున్నారు.. ఎలాంటి హెచ్చరిక లేకుండానే డ్యాం గేట్లు ఎత్తేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ప్రమాదంలో క్షేమంగా బయటపడిన వారి వివరాలు ఇలా ఉన్నాయి…

మరోవైపు… ప్రమాద ఘటన సమాచారం తెలియగానే సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే అధికారులను అప్రమత్తం చేసిన సీఎం.. హైదరాబాద్‌లో కంట్రోల్‌ రూం ఏర్పాటుకు ఆదేశించారు. కంట్రోల్‌ రూం నెంబర్లు: 040-23202113, 9440815778. మరోవైపు సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి హిమాల్‌ప్రదేశ్‌ వెళ్లారు. ఐఏఎస్‌ అధికారి బీఆర్‌ మీనా, ఐపీఎస్‌ అధికారి కార్తికేయ సహాయకచర్యలను పర్యవేక్షించడానికి ఘటనాస్థలికి చేరుకున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌ సీఎస్‌తో మాట్లాడి.. తెలంగాణ సీఎస్‌ రాజీవ్‌శర్మ వివరాలు తెసుకున్నారు.. సహాయకచర్యలను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.. ఇటు ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే సహాయకచర్యలు చేపట్టాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

దాదాపు 12గంటలు గడుస్తున్నా ఇంతవరకు విద్యార్థుల ఆచూకీ తెలియకపోవడంతో వారి కుటుంబాల్లో ఆందోళన మొదలైంది. తమ బిడ్డలు ఏమయ్యారోనని కన్నవారు కన్నీరు మున్నీరవుతున్నారు. బాచుపల్లిలోని విజ్ఞాన్‌జ్యోతి కాలేజీకి చేరుకుని వివరాల కోసం ఆరా తీస్తున్నారు..

హిమాచల్‌ప్రదేశ్‌ అధికారులు మాత్రం.. విద్యార్థుల ఆచూకీ కోసం సాయశక్తులా కృషిచేస్తామని అంటున్నారు. కాలువ లోతు పెద్దగా లేకపోవడంతో.. విద్యార్థులు సురక్షితంగానే ఉండివుండొచ్చని ధైర్యం చెబుతున్నారు..

Advertisements
Video | This entry was posted in Hyderabad News, National, Telangana and tagged , , , , , , , , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s