అభివృద్ధి అజెండాతో గద్దెనెక్కిన మోడీ సర్కారు బాదుడు మొదలుపెట్టింది. ఇంధన సర్దుబాటు పేరుతో రైల్వే ఛార్జీలను భారీగా పెంచేశారు. పైగా.. గత యుపిఎ ప్రభుత్వం పెంచి వెనక్కు తీసుకున్న ఛార్జీలనే ఇప్పుడు తాము పెంచామని రైల్వే మంత్రి సమర్థించుకునే ప్రయత్నం చేశారు. జంటనగరాల నుంచి ముఖ్య పట్టణాలకు రైల్వే ఛార్జీలు ఏమేరకు పెరుగుతాయో ఓసారి చూద్దాం.
పెరిగిన ఖర్చుల నేపథ్యంలో రైల్వే ఛార్జీలు పెంచాల్సి వచ్చిందని ఆ శాఖ మంత్రి సదానంద గౌడ అన్నారు. ప్రయాణికుల ఛార్జీ ఏకంగా 14.2 శాతం పెరిగింది. హైదరాబాద్-విశాఖ మధ్య ఛార్జీలను పరిశీలిస్తే.. ప్రస్తుతం స్లీపర్‌క్లాస్ టికెట్ 360 రూపాయలు. ఇది 45 రూపాయలు పెరిగి 405కు చేరుతుంది. థర్డ్‌ఏసీ 125, సెకండ్ ఏసీ 180, ఫస్ట్ ఏసీ 305 రూపాయల చొప్పున పెరుగుతాయి.
ఇక, సికింద్రాబాద్-తిరుపతి మధ్య స్లీపర్‌క్లాస్‌లో వెళ్లాలంటే 345 రూపాయల ఛార్జ్ ఉంది. ఇక మీదట 40 రూపాయలు అదనంగా చెల్లించాలి. ఏసీలో వెళ్లాలంటే 115 నుంచి 290 రూపాయల వరకు బాదుడు తప్పదు. కాచిగూడ-బెంగళూర్ సిటీ మధ్య దాదాపు ఇవే చార్జీలు ఉంటాయి.
హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీ వెళ్లే ప్రయాణికులు స్లీపర్‌లో 590 రూపాయలు చెల్లిస్తుండగా.. అది 670 అవుతోంది. అంటే 80 రూపాయల వడ్డింపు. సెకండ్ ఏసీ 210 రూపాయలు పెరిగి 1745, థర్డ్‌ఏసీ 315 రూపాయలు పెరిగి 2545 రూపాయలు, ఫస్ట్ ఏసీ 540 రూపాయల భారంతో 4375 రూపాయలు అవుతోంది.
హైదరాబాద్ -చెన్నై, హైదరాబాద్-ముంబై మధ్య దూరం 790 కిలోమీటర్లు కాగా… స్లీపర్‌క్లాస్ ప్రయాణికులు 45, థర్డ్ఏసీలో 130, సెకండ్ ఏసీలో 190, ఫస్ట్ ఏసీలో 325 రూపాయలు భారం భరించాల్సి ఉంటుంది.
ఈ మోత ఈనెల 25 నుంచి అమల్లోకి వస్తుందని రైల్వే మంత్రి సదానంద సవినయంగా సెలవిచ్చారు. ఛార్జీలేనా, సర్‌ఛార్జీల పేరుతో పైకి కనిపించని బాదుడు ఉంటుందా అంటే.. అవన్నీ బడ్జెట్లో చూసుకోండని స్పష్టంచేశారు.