సాగర్ జలాలపై ఏపీ, తెలంగాణ సర్కార్ రగడ…వాటర్‌ బోర్డు ఆదేశాలపై ఇవాళ సీఎం కేసీఆర్ సమీక్ష

  • ఏపీ , టీజీ మధ్య కృష్ణా నీటి వివాదం
  • గవర్నర్‌ జోక్యంతో దిగొచ్చిన టీ సర్కారు
  • సాగర్‌ నుంచి 3.6 టీఎంసీల నీరు విడుదల
  • అర టీఎంసీ కూడా ప్రకాశం బ్యారేజీ చేరలేదన్న ఏపీ
  • మరో 6 టీఎంసీలు వదలాలని కేంద్రానికి ఏపీ వినతి
  • వారం పాటు రోజుకు 6 వేల క్యూసెక్కులు వదలాలన్న కేంద్రం
  • బోర్డు నిర్ణయంపై టీ సర్కారు సీరియస్‌
  • ఏకపక్ష నిర్ణయాలేంటని మండిపాటు
  • 2 టీఎంసీల నీరు ఎలా వృథా అవుతుందని ప్రశ్న
  • నీటి విడుదలపై ఇవాళ కేసీఆర్‌ సమీక్ష


తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాలు… పెట్రోల్‌లా మండుతున్నాయి. తాగునీటి కోసం నీరు విడుదల చేయాలన్న ఏపీ డిమాండ్‌తో మొదలైన ఈ వివాదం.. కేంద్రం నిర్ణయంతో మరింత ముదిరినట్లైంది. ఒకసారి విడుదల చేశాక.. మళ్లీ నీళ్లివ్వాలంటూ.. కేంద్రం ఏకపక్షంగా ఆదేశాలు జారీ చేయడమేంటని.. తెలంగాణ సర్కారు మండిపడుతోంది. దీనిపై ఇవాళ ఉన్నతస్థాయి సమీక్ష జరిపాకే తమ నిర్ణయం వెల్లడిస్తామని తెగేసి చెప్పింది.

 

 

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య జలజగడాలు పెరుగుతూనే ఉన్నాయి. నీటి విడుదల రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతూనే ఉంది. నాగార్జున సాగర్‌లో నీటి  విడుదల జరగాలంటే రెండు రాష్ట్రాల అంగీకారం అవసరం. కృష్ణా డెల్టాలో రైతులు సాగర్ నీటిని విడుదల చేయాలంటూ ఉద్యమాలు కూడా చేశారు. అయితే తెలంగాణ అవసరాలను దృష్టిలో పెట్టుకుని టీ సర్కార్ నీటి విడుదలపై ఆచి తూచి వ్యవహరించింది. చివరికి గవర్నర్ నరసింహాన్‌ జోక్యంతో… సాగర్ నుంచి కృష్ణా డెల్టాకు 3.6 టీఎంసీల నీటిని వదిలింది. అయితే ఇందులో అర టీఎంసీ మాత్రమే ప్రకాశం బ్యారేజ్‌ వరకు చేరిందని మిగతా నీరంతా భూమిలోకి ఇంకిపోవడం.. కాలువల ద్వారా వృథాగా పోవడం జరిగిందని ఏపీ అధికారులు తెలిపారు. నాలుగు జిల్లాల తాగునీటి అవసరాల కోసం తమకు మరో 6 టీఎంసీల నీటిని వదలాలని కేంద్రాన్ని  కోరారు. ఏపీ విన్నపాన్ని ఆలకించిన కృష్ణా వాటర్ బోర్డు.. రోజుకు 6 వేల క్యూసెక్యుల నీటిని వారం రోజులపాటు విడుదల చేయాలని ఆదేశించింది. దీంతో ఏపీ సర్కారు కొంత ఊపిరిపిల్చుకుంది.

అయితే ఈ నిర్ణయమే ఇప్పుడు కొత్త వివాదానికి తావిచ్చింది. అడిగినంత నీరు విడుదల చేశాక కూడా మళ్లీ కొత్త పేచీ పెట్టడమేంటని.. తెలంగాణ సర్కారు మండిపడుతోంది. కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు ఆదేశాలపై అభ్యంతరం వ్యక్తం చేసిన టీ-సర్కారు.. అసలు తమ అభిప్రాయం కూడా తెలుసుకోకుండా నిర్ణయం ఎలా తీసుకుంటారని ప్రశ్నించింది. 3.5 టీఎంసీల నీరు తమకు చేరలేదన్న ఏపీ వాదనపై స్పందించిన ప్రభుత్వం.. నీరు వృథా అవ్వడం వారి తప్పిదమేనని తేల్చిచెప్పింది. అసలు 2 టీఎంసీల నీరు ఎలా వృథా అవుతుందని ప్రశ్నించింది. కృష్ణా రివర్‌ బోర్డ్‌ తాజా ఆదేశాలపై.. సీఎం కేసీఆర్‌.. ఇవాళ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. కేంద్రం అడిగినట్లు నీరు విడుదల చేసే అంశం సాధ్యాసాధ్యాలపై చర్చించనున్నారు.  ఈ సమీక్ష తర్వాతే నీటి విడుదలపై సర్కారు తుది నిర్ణయం తీసుకోనుంది.

అయితే కేంద్రం నిర్ణయంపై తెలంగాణ సర్కారు ఏ విధంగా స్పందిస్తుందన్నది వేచిచూడాలి. ఒక వేళ టీ సర్కారు నీటి విడుదలకు ఒప్పుకోకుంటే.. ఈ వివాదం ఏ మలుపు తీసుకోనుందన్నది ఆసక్తికరంగా మారింది.

Advertisements
Video | This entry was posted in Andhra Pradesh News and tagged , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s