తెలంగాణ అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఖచ్చితమైన ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. దీనికోసం విధివిధానాలను రూపొందిస్తున్నారు. అధికారులతో ప్రత్యేకంగా సమావేశమైన ఆయన ఈ దిశగా సూచనలిచ్చారు. బంగారు తెలంగాణ కల సాకారం చేయడమే తన లక్ష్యమని వివరించారు.
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, సమగ్ర ప్రణాళికపై సీఎం కేసీఆర్ మేథోమథనం చేశారు. హైదరాబాద్లోని ఎంహెచ్ఆర్డీలో అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాబోయే ఐదేళ్లు ఏం చేయాలి? అభివృద్ధి వైపు అడుగులేయడం ఎలా ? విధివిధానాలు, తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు.
ఈనెల 7న రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, కలెక్టర్లు, జిల్లా స్థాయి అధికారులతో సమావేశానికి శ్రీకారం చుట్టబోతున్నారు. తెలంగాణ అభివృద్ధి విషయంతో పాటు ప్రభుత్వ ప్రాధాన్యతలు, లక్ష్యాలు అధికారులకు వివరించాలని కేసీఆర్ భావిస్తున్నారు. రాష్ట్రం మొత్తానికి ఒకే విధానం కాకుండా జిల్లాలు, భౌగోళిక పరిస్థితులు, స్థానిక సమస్యలు, వనరులు… ఇలా అన్నింటిని టచ్ చేస్తూ ముందుకెళ్ళేలా ప్లాన్ చేస్తున్నారు. అనంతరం జిల్లా అధికారులు తమ పరిధిలో సమగ్ర ప్రణాళికల రూపకల్పనకు దిశానిర్దేశం చేయనున్నారు.
గ్రామస్థాయి నుంచి అభివృద్ధిని శరవేగంగా పరిగెత్తించేందుకు కేసీఆర్ తహతహలాడిపోతున్నారు. అందుకే అధికారులందరినీ ఇందులో భాగస్వామ్యులను చేయనున్నారు. ప్రభుత్వ పథకాలు, చట్టాలు, విధానాలు, పద్దతులు అన్నీ పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ధృక్పథంతోనే ఉన్నాయని, అన్నింటిని మార్చి తెలంగాణాకు అనుకూలంగా అమలు చేయడమే లక్ష్యమని కేసీఆర్ భావిస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వంలో కొత్త సర్పంచ్ దగ్గర నుంచి ఎమ్మెల్యే వరకు అందరికీ మర్రి చెన్నారెడ్డి మానవనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణ ఇప్పించేందుకు కేసీఆర్ యోచిస్తున్నారు. ఇక కొత్త జిల్లాల ఏర్పాటు, జిల్లాల అభివృద్ధి, జాయింట్ కలెక్టర్ల సంఖ్య పెంపుపైనా త్వరలోనే కేసీఆర్ ఓ నిర్ణయం తీసుకోబోతున్నారు. స్థానికంగా ఉన్న వనరులతో ముందడుగేయడంతో పాటు ప్రజాప్రతినిదులందరినీ భాగస్వాములను చేయడానికి ముందడుగేస్తున్నారు.